Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ప్లస్ అయ్యాయి. పురంధేశ్వరితో పోలిస్తే ఆమెతో ఈ రేసులో నిలిచిన వారు ఆయా అంశాల్లో ఆమెతో పోటీ పడే పరిస్ధితి లేదు. అలాగే యూపీఏను వీడి బీజేపీలో చేరిన తర్వాత కూడా పురంధేశ్వరి తనదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా జాతీయ స్ధాయి పదవిలో నియామకం తర్వాత అగ్రనేతలతో కలివిడిగా ఉండటం, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడం, ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపికి ఉపయోగపడే స్ధాయిలో ఉండటం పురంధేశ్వరికి ప్లస్ అయ్యాయి. అయితే వీటన్నింటికంటే మించిన మరో కీలక కారణం ఆమెను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యేందుకు పనికొచ్చింది.
దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్ 22, 1959లో జన్మించారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన పురంధేశ్వరి.. 2004లో బాపట్ల నుంచి 14వ లోక్‌సభకు .. 2009లో విశాఖ నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పురంధేశ్వరి పార్టీని వీడారు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం బీజేపీకు ఒడిశా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పురందేశ్వరికి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్నాయి. మధ్యలో జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్నా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే పరిస్దితి తయారైంది. ఇలాంటి సమయంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా తన ప్రయారిటీ ఏంటో బీజేపీ చెప్పేసింది. ఇప్పటికే టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో జనాల్లోకి వెళ్లడం ద్వారా అధికారం కొల్లగొట్టాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.
పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగిస్తే ఆమె సామాజికవర్గానికి చెందిన వారితోపాటు తెలుగుదేశం పార్టీలోని కొందరు సీనియర్ నేతలను కూడా బీజేపీలోకి చేర్చుకొని పార్టీ బలోపేతానికి బాగా కృషిచేస్తారని అధినాయకత్వం భావించింది. సోమువీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ ఇసుమంత కూడా బలపడలేదని పార్టీ ఢిల్లీ పెద్దలు తెప్పించుకున్న నివేదికల ద్వారా కూడా వెల్లడైందని తెలుస్తోంది. కనీసం పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సోము రూపొందించలేకపోవడంతో ఆయన్ను తప్పించారని పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ పెద్దలకు పురంధేశ్వరి ఒక్కరే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించారు. గత ఎన్నికల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ స్ధానంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అప్పటికే పార్టీలో ఉన్న ఇతర నేతలతో పొసగలేదు. అయినా అధిష్టానం మాత్రం ఆయన్ను కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలతో పాటు కాపు నేతలతోనూ సోము విభేదాలు కొనసాగాయి. ఈ తరుణంలోనే సోము వీర్రాజును మారుస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇది ఆలస్యంకావడంతో కన్నావంటి నేతలు పార్టీని వీడి పోయారు. ఈ సమయంలో పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది.