BJP out From South India: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మించి మంచి ఫలితాలు సాధించింది. కర్ణాటకలో అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రుల నుంచి ప్రధాన మంత్రి దాకా….ధీమా వ్యక్తం చేశారు. 140 సీట్లు సాధిస్తామని…అధికారంలోకి వస్తున్నామంటూ…ప్రతి బీజేపీ నేత ఢంకా భజాయించి చెప్పారు. సీన్ కట్ చేస్తే…బీజేపీ కనీసం 70 సీట్లు కూడా సాధించలేకపోయింది. బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తుంటే…ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. కర్ణాటకలో ఓటమితో…సౌత్‌లో బీజేపీకి ఉనికి లేకుండా పోయింది. ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 71. ఇందులో కర్ణాటకలోనే 63 మంది సభ్యులు ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ…అధికారంలో లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళలో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. కమలం పార్టీ నుంచి ఒక్కరు కూడా అసెంబ్లీకి ఎన్నికవలేదు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో…ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తమిళనాడులో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే…తెలంగాణలో ముగ్గురంటే ముగ్గురు ఎన్నికయ్యారు. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలుపొందారు. దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి ఇప్పట్లో అధికారం కలలాగానే కనిపిస్తోంది. కర్ణాటకలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఏపీలో ఆ పార్టీ ఉందంటే ఉందంతే. తమిళనాడులో అదే పరిస్థితి. కేరళలో పరిస్థితి మరీ దారుణం.
ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా…నిరాశే ఎదురైంది. తమదే అధికారమంటూ ధీమాతో ఉన్న బీజేపీకి కన్నడ ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పారు. 40 శాతం కమిషన్, బొమ్మై సర్కార్‌పై అవినీతి ఆరోపణలతో… దక్షిణాదిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని కోల్పోవడంతో…బీజేపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తే…ప్రజలు మరోలా తీర్పు ఇవ్వడంతో బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో…బీజేపీ అధికారాన్ని చేపట్టింది. బొమ్మై ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత…సర్కార్‌పై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయ్. 40 శాతం కమిషన్ సర్కార్ అంటూ…కాంగ్రెస్ ఎత్తుకున్న నినాదం ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది. దీనికి తోడు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు…కాషాయ పార్టీకి అధికారాన్ని దూరం చేశాయ్. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మాదిరిగానే…మతం, సెంటిమెంట్‌తో అధికారంలోకి వస్తామని బీజేపీ భావించినా…దక్షిణాదిలో కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రజలు తేల్చేశారు.