మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవడంతో త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అందరూ లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రాంచీ రావాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారట. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం సీఎం నివాసంలో అందరూ సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలు అందరూ రాంచీలోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియాలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్‌లు ఆడగలడు!
‘సీఎం హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యేలను బ్యాగులతో రాంచీకి పిలిచారు. సమాచారం ప్రకారం.. సీఎం హేమంత్ తన సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణతో సీఎం భయపడుతున్నారు. తాను రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి రాంచీకి వస్తానని పార్టీ నేతలకు సోరెన్ చెప్పినట్లు తెలిసింది’ అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈడీ అధికారులు సోమవారం సోరెన్ ఇంటికి వెళ్లి 13 గంటలకు పైగా మనీలాండరింగ్ కేసు విచారణ చేశారు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ ప్రకటన వచ్చింది.