Vishnu Vardhan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమానికి సిద్ధం అవుతోంది భారతీయ జనతా పార్టీ.. గుంటూరులో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం వివరాలను వెల్లడించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని చార్జిషీట్ల రూపంలో ప్రజలకు వివరిస్తాం అన్నారు. మే 5వ తేదీ నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం నిర్వహిస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వ స్టిక్కర్లు వేస్తున్నారు అని ఆరోపించారు. ఆయుస్మాన్ భవ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ స్టిక్కర్ వేశారు. ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంటే వాటిని ప్రజలకు పంచటం లేదని ఆరోపించారు.. కేంద్రం లక్షలాది ఇళ్లు మంజూరు చేస్తే వాటికి జగనన్న ఇళ్లు అనే పేరు పెట్టారు.. రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలమయం అని విమర్శించారు.. వైసీపీ నేతలు సహజ వనరులను దోచుకోవటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.. రాష్ట్రాన్ని మరింత అప్పులమయం చేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు సూర్యనారాయణరాజు.
Read Also: Naveen Polishetty: ఓయ్.. జాతిరత్నం.. ‘అనగనగ ఒక రాజు’ అన్నావ్.. ఉందా..? లేదా..?
ఇక, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేశారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. కేంద్రం ఇచ్చే పథకాలు అందిపుచ్చుకునే పరిస్థితి లేదన్న ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలపై ఐదు స్థాయిల్లో ఛార్జీషీట్లు వేయాలని నిర్ణయించామని వెల్లడించారు.. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు.. సర్పంచుల స్థానంలో వార్డు వాలంటీర్లు పెత్తనం చేస్తున్నారు.. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహం ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీలకు అవార్డులు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు వైసీపీ మాఫియా చెప్పిందే నడుస్తోందని మండిపడ్డారు.. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు.. అన్నమయ్య డ్యాం కొట్టుకు పోతే బాధితులకు ఇప్పటి వరకూ ఆదుకోలేదు.. కాంట్రాక్టర్లు డబ్బులు రావని పనులు చేయటం లేదు.. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు వైద్యం ఆపేసే పరిస్థితి అంటూ ఆరోపణలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీల పనులు మాత్రమే జరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కాలేజీల పనులు కనీసం ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది, ఎవరూ అప్పు ఇచ్చేపరిస్థితి లేదని.. అందుకే వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి. ఇదొక్కటే మార్గం అని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.