కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడులు కక్షసాధింపేనని టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి విద్యా సంస్థలపై సర్చ్ వారంటీతో ఐటీ సోదాలు నిర్వహించిందని, మల్లారెడ్డి బంధువులు, సన్నిహితులు, కళాశాలలు,కార్యాలయాలు, ఇళ్లల్లో చేసిన ఐటీ సోదాల్లో 18 కోట్లు దొరికాయన్నారు. ఐదు ఏళ్లలో 5 వందల నుంచి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా వంద కోట్లు సంపాదించారని, మంత్రి పదవిలో ఉన్న మల్లారెడ్డి సర్చ్ వారంటీని చింపేసి, ల్యాప్ ట్యాప్ ను గుంజుకున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Veera Simha Reddy: చిరు వచ్చేశాడు ఇక బాలయ్య వంతు…
మంత్రి పదవిలో ఉండే అర్హత మల్లారెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ సోదాలు చేస్తే బీజేపీ చేయిస్తుందని మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయించారని, ఆక్రమిత స్థలాల్లో కాలేజీలు కట్టారని శాంతి కుమార్ విమర్శించారు. కబ్జాదారు మల్లారెడ్డి మోదీ దిష్టి బొమ్మ దగ్దం చేయిస్తారా అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఅర్ కు చిత్తశుద్ది ఉంటే తక్షణమే మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ అధికారుల విధులకు ఆటంకాలు కలిగించి… తప్పించుకోవడానికి అధికారులపై కేసులు పెట్టారని, మల్లారెడ్డి అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, మల్లారెడ్డి తప్పించుకోలేరు.. శిక్ష అనుభవించక తప్పదని శాంతి కుమార్ ఉద్ఘాటించారు.