BJP leader Family Killed in Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత కుటుంబాన్ని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూరులో జరిగింది. హత్య కాబడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సెంథిల్ అనే 47 ఏళ్ల వ్యక్తి పల్లాడం దగ్గరలోని కళ్లికనారు వద్ద హోల్ సేల్ రైస్ షాపును నడుపుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొంతమంది వారి స్థలం వద్ద మద్యం తాగారు. వారి స్థలంలో మద్యం తాగొద్దని సెంథిల్ చెప్పడంతో వారు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. సెంథిల్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆయనను కాపాడటానికి పరుగు పరుగున వచ్చారు. అయితే వారిపై కూడా దుండగలు దాడి చేశారు.
Also Read: Vivek Ramaswamy: ట్రంప్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తా.. వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు
ఈ ఘటనలో సెంథిల్ తో పాటు ఆయన సోదరుడు మోహన్ రాజ్, వారి తల్లి, అత్తయ్య కూడా ఉన్నారు. సెంథిల్ సోదరుడు మోహన్ రాజ్ బీజేపీ కార్యకర్త. ఆయన పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మొన్నిమధ్యే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వచ్చినప్పుడు కూడా ఆయన జనాలను పోగేసి సభ ఏర్పాటు చేశారు. అయితే దుండగులు చేసిన దాడిలో నలుగురు కుటుంబ సభ్యులు మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ హత్యలకు కారణం కేవలం మద్యం మత్తులో ఉన్న వారితో గొడవేనా లేక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే కోణం పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా వుండగా నిందితులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ వన్ సీఎం అని చెప్పుకునే స్టాలిన్ రాష్ట్రంలో ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. చనిపోయిన మోహన్ రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.