BJP Leader Bhanu Prakash Reddy Slams YCP Govt: ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నేడు మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత భాను ప్రకాశ్ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు. మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని పురంధేశ్వరి కోరారు. దీన్ని తట్టుకోలేకే సజ్జల అలా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మా పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉంది. పురందేశ్వరి శక్తి సామర్థ్యాలను గుర్తించే.. ఆమెకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా ప్రతిరేక విధానాలను ఆమె ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకుండా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలి లాగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు’ అని భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
‘ముఖ్యమంత్రి సామర్లకోటలో పర్యటిస్తుంటే.. కాకినాడలో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మద్యం విక్రయాలలో అధికార పార్టీ నేతలు కోట్లు ఆర్జిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యం ద్వారా కోట్ల రూపాయలను అర్జిస్తున్నారు. ఏపీలో ఐపీసీకి బదులు వైసీపీ సెక్షన్లు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలను అధికార పార్టీ నేతలు కాల రాస్తున్నారు’ అని భాను ప్రకాశ్ అన్నారు.
Also Read: Salman: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’
‘ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడుతున్నారు. నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. సొంత పార్టీలో వ్యవహారాలను పట్టించుకోకుండా బీజేపీ గురించి మాట్లాడటం అవసరమా?. పేద ప్రజలు వెంకటేశ్వరస్వామికి ఇచ్చే నిధులను కూడా తిరుపతి అభివృద్ధికి మళ్లిస్తున్నారు. టీటీడీ బడ్జెట్లో ఒక శాతం మేర నిధులు అంటే.. ఏడాదికి రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం సరికాదు. దేవాలయ నిధులను దారి మళ్లిస్తున్నారు. శానిటేషన్ పెడితే మరో రూ. 50 కోట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుంది. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్ను సీఎం జగన్ వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంకు ప్రజలు బుద్ధి చెబుతారు’ అని భాను ప్రకాశ్ పేర్కొన్నారు.