ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
ఆప్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలను రూ.25 కోట్లకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ నోటీసు తీసుకునేందుకు సీఎం నిరాకరించారు.
తాజాగా ఇదే అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కోలేక కేజీవ్రాల్ తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన పెద్ద అతినీతిపరుడని ప్రజలకు అర్థమైందని చెప్పుకొచ్చారు. క్రైమ్ బ్యాంచ్ పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా తీసుకునేందుకు ఆయన నిరాకరించారని.. విచారణ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారని షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ నుంచి కేజ్రీవాల్ డుమ్మాకొడుతున్నారు. ఇప్పటికే ఆయన ఐదుసార్లు తప్పించుకున్నారు. తాజాగా క్రైమ్ బ్యాంచ్ ఇచ్చిన నోటీసులను కూడా తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. బీజేపీ కావాలనే దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ-ఆప్ మధ్య నడుస్తున్న ఈ వార్ ముందు ముందు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Indraja Shankar: పెళ్లి పీటలు ఎక్కనున్న బిగిల్ గుండమ్మ.. డైరెక్టర్ ను ప్రేమించి.. ?