Lowest Victory Margin in Chhattisgarh Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలుబడిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు ఉండగా.. బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. మునుపెన్నడూ లేనంతగా బీజేపీ మెజార్టీని సొంతం చేసుకోగా.. గత నాలుగు ఎన్నికల్లో ఎన్నడూలేనంత తక్కువకు కాంగ్రెస్ సీట్లు పడిపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. కేవలం 16 ఓట్ల తేడాతో కాంకేర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు.
కాంకేర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశా రామ్ నేతమ్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ ధ్రువ కేవలం 16 ఓట్ల తేడాతో ఓడారు. శంకర్ ధ్రువకు 67,964 పోల్ కాగా.. ఆశా రామ్ నేతమ్‌కు 67,980 ఓట్లు పోలయ్యాయి. స్వల్ప తేడాతో ఓడడంతో శంకర్ ధ్రువ కన్నీటి పర్యంతం అయ్యారు. అంబికాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్‌కు 90,686 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 90,780 ఓట్లు పోలయ్యాయి. కేవలం 94 ఓట్ల తేడాతో సింగ్ దేవ్ ఓడిపోయారు.
Also Read: Telangana Election Result: 221 మంది మహిళలు పోటీ చేస్తే.. 10 మంది గెలిచారు!
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ సీనియర్ నేత బ్రిజ్‌మోహన్ అగర్వాల్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌పుర్ దక్షిణ నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 67,179 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. డిప్యూటీ సీఎం సహా భూపేశ్ బఘేల్ సహా 9 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు.