Bitcoin Scam Case: బిట్‌కాయిన్ స్కామ్ కేసులో వ్యాపారవేత్త, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. పీఎంఎల్ఏ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు సోమవారం రాజ్‌కు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను స్వీకరించిన అనంతరం కోర్టు ఈ చర్య తీసుకుంది. కుంద్రాతో పాటు దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేష్ సతీజాకు కూడా సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ జనవరి 19న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
READ MORE: Poonam Kaur : పోసాని కారణంగా.. నా సర్వస్వం కోల్పోయా – పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.
గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌లో రాజ్ కుంద్రా, రాజేష్ సతీజాలను నిందితులుగా చేర్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం.. ‘గైన్ బిట్‌కాయిన్’ పాంజీ స్కామ్ ప్రధాన సూత్రధారి అమిత్ భర్ద్వాజ్ నుంచి యుక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు కోసం కుంద్రా 285 బిట్‌కాయిన్లు అందుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడంతో ప్రస్తుతం కూడా ఆ 285 బిట్‌కాయిన్లు కుంద్రా వద్దనే ఉన్నాయని ఈడీ వెల్లడించింది. వాటి ప్రస్తుత విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. చార్జిషీట్‌లో కుంద్రా తాను ఆ లావాదేవీలో మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని చెప్పినప్పటికీ, దానికి ఆధారమైన ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదని పేర్కొంది. పైగా “టర్మ్ షీట్” అనే ఒప్పందం కుంద్రా, అమిత్ భర్ద్వాజ్ తండ్రి మహేందర్ భర్ద్వాజ్ మధ్య కుదిరిందని ఈడీ స్పష్టం చేసింది. 2018 నుంచి అనేక అవకాశాలు ఇచ్చినా 285 బిట్‌కాయిన్లు ఎక్కడికి బదిలీ అయ్యాయో చూపించే వాలెట్ అడ్రెసులను కుంద్రా సమర్పించలేదని ఈడీ ఆరోపించింది.
READ MORE: Falcon Scam: రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ