Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్‌లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, పోలీసులు ప్రజలు సమాచారం అందించడంతో.. గ్రామస్తుల సహకారంతో పోలీసులు చెరువు నుంచి ప్రజలను బయటకు తీస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 15 మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, ప్రమాదంపై సమాచారం అందుకున్న కస్సా తూర్పు గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి చేరుకోవడంతో చెరువు గట్టుపై గందరగోళం నెలకొంది. రద్దీ కారణంగా హైవే రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.
Read Also: CM Revanth Reddy: 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్.. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు?
కాగా, మృతుల్లో మహిళలు, పలువురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. తీవ్రంగా గాయపడినవారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటన ప్రదేశంలో పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు పరిపాలన విభాగానికి చెందిన అధికారులు కూడా సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక, జిల్లా దవాఖానకు పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు రావడంతో స్ట్రెచర్ల కొరత ఏర్పడింది. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.