గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ171) కుప్పకూలడంతో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మృతి చెందారు. విమానం ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం భవనంపై కుప్పకూలడంతో 24 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చగా.. ఇద్దరు మాత్రం తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పది నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే యువతి ప్రాణాలను నిలబెట్టింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్‌లో ఓ సీటును భూమి చౌహాన్ బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీంతో భూమి చౌహాన్ పది నిమిషాలు ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్ అయి.. కాసేపటికే కుప్పకూలింది. విషయం తెలిసిన ఆమె షాక్‌కు గురైంది. ‘విమాన ప్రమాదం గురించి తెలియగానే షాక్‌కు గురయ్యా. ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. నేను అస్సలు మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’ అని భూమి చౌహాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లండన్‌లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం ఇండియా వచ్చింది. తిరుగు ప్రయాణంకు టికెట్ బుక్ చేసుకోగా.. ఆలస్యం ఆమె ప్రాణాలను నిలబెట్టింది.
Also Read: AirIndia Plane Crash: కుటుంబం మొత్తాన్ని బలిగొన్న విమాన ప్రమాదం.. లండన్‌లో స్థిరపడాలని..!
గుజరాత్‌కు చెందిన 60 ఏళ్ల సవ్‌జీభాయ్ టింబడియాను అదృష్టం కాపాడింది. లండన్‌లో నివసిస్తున్న సవ్‌జీభాయ్ కుమారుడు ఇటీవల ఆయన కోసం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేశారు. ఎయిర్ ఇండియా సంస్థ ఆయనకు సీటు నంబరు కూడా కేటాయించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నాలుగు రోజుల క్రితమే సవ్‌జీభాయ్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. అహ్మదాబాద్‌లో గురువారం విమానం ప్రమాదానికి గురి కాగా.. అదృష్టం కొద్ది ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ దేవుడి దయతోనే తాను ప్రాణాలతో బయపడ్డాడని సవ్‌జీభాయ్ తెలిపారు.