బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నాం అని భట్టి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ‘విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును జయించవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. 2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నాము. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే. ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తుంది మా ప్రభుత్వమే. 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టం తెచ్చారు. ఆ చట్టం వల్లనే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నాం. 500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తున్నాం’ అని భట్టి చెప్పారు.
‘యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ఎన్ని సార్లు సమీక్ష చేశాం. వారం వారం పని ప్రగతి చూశా. అందుకే రెండు యూనిట్లు ప్రజలకు అంకితం చేయగలిగాం. యాదాద్రి పవర్ ప్లాంట్ జనవరి వరకు పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తాం. భూసేకరణ నిధులకి ఇబ్బంది లేదు. రోడ్డు కోసం భూసేకరణ చేస్తే.. 24 గంటల్లో నిధులు ఇస్తాం. కాంగ్రెస్ వస్తె కరెంట్ ఉండదు అని ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వాళ్లకు, ఉన్నది లేనట్టు చెప్పడం అలవాటు. కరెంట్ అంటే కాంగ్రెస్. నాగార్జున సాగర్ కట్టి.. జపాన్ నుంచి కంపనీలు పిలిచి కరెంట్ ఉత్పత్తి చేశాం. ఇప్పటికి కూడా అదే లేటెస్ట్ టెక్నాలజీ. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే.. ఎనర్జీ పాలసీ తెచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు లేవు. 51 లక్షల మంది ఇండ్లకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 17 వేల కోట్లు విద్యుత్ శాఖకు ఈ ప్రభుత్వం కడుతుంది’ అని తెలిపారు.
Also Read: Jagga Reddy-KTR: కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
‘ఓ వ్యక్తి నాకు ఒకటి పంపారు. ఉద్యోగాలు పొందే వారికి కోట్లు ఖర్చు చేసి నియామకాలు చేయడం అవసరమా అని అడిగాడు. అందరిని పిలిచి.. మీకు ఉద్యోగ పత్రాలు ఇవ్వడం అంటే మానవ సంబంధాలు పెంచుకోవడం లాంటిది. మిషన్ లాగా.. మెకానికల్ లైఫ్ కాదు. మా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని చూస్తున్నాం. బీఆర్ఎస్ పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో లేదా ఏడవాలో అర్థం కావడం లేదు’ అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.