KTR has no Political Maturity Said Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?, అప్పుడు చిల్లర అనిపించలేదా? అని విమర్శించారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సభలో చెప్పారు, ఆ మాట నువ్వు మర్చిపోయావా? అంటూ కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే.. ఆ పార్టీ నుంచే పాఠాలు నేర్చుకున్న మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా? అని జగ్గారెడ్డి అన్నారు.
జగ్గారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియా మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు (కేటీఆర్) ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా?. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా, అప్పుడు చిల్లర అనిపించలేదా?. అప్పుడు అనిపించనిది.. ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది?. మీ కుటుంబం వెలిగిపోతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా?. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే.. మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా?. థర్డ్ క్లాస్ నుంచే కదా.. నువ్వు రాజకీయ నాయకుడివి అయ్యింది. వందకోట్ల ప్రజలకు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చింది. కేటీఆర్.. కాంగ్రెస్ అంటే ఏందో కేసీఆర్‌ని అడిగి తెలుసుకో. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండకపోయేది. అమెరికాలో జీతం మీదనే బతికే వాడివి నువ్వు. నీ కుటుంబం ఏం చేసి బతుకుతుండేనో మరి’ అని ఫైర్ అయ్యారు.
‘సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెడితే తెలంగాణ బిడ్డగా ఆయనకు ఓటేయాల్సింది పోయి.. ఉల్టా కాంగ్రెస్ మీదనే ఆరోపణలు చేస్తావా?. కేటీఆర్, కేసీఆర్‌వి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉన్నా రాజకీయ మెచ్యూరిటీ రాలేదు, అందుకే మాటకు దొర్లుతున్నాడు. కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ తాత-నానమ్మ బతికి ఉంటే.. ఆయన్ను పిలిచి తిట్టే వారు. అసవరం అనుకుంటే చెంప మీద కొట్టేవాళ్ళు. కేటీఆర్‌కు త్యాగాల విలువ తెలియదు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా?. తిని దీక్ష చేసినా.. యాక్సెప్ట్ చేసే వాళ్ళు. అప్పుడు పరిస్థితి అది. కేసీఆర్ దీక్ష అంత కాంగ్రెస్ డిజైన్. మా వాళ్ళ బాధ మా వాళ్ళది.. జానారెడ్డి ముందుండి చేశారు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Also Read: HIgh Court: కేసీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో బిగ్ షాక్!
‘తెలంగాణ వచ్చి ప్రజలకు బెనిఫిట్ ఏమైందో తెలియదు కానీ.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం బాగా బెనిఫిట్ అయ్యింది. కేటీఆర్‌కి రాజకీయ మెచ్యూరిటీ లేదు. కేటీఆర్ తొందరపడి మాట్లాడి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. సచివాలయంలో నేను రివ్యూ చేశా.. దానిపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా మొగొన్నే. సచివాలయంలో దందా చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పా. మళ్ళీ మళ్ళీ చేస్తా. మీ లెక్క కొడుకు, అల్లుడు, బిడ్డలు పంచుకున్నట్టు పంచుకున్నానా?. గెలుపు, ఓటమి కాదు.. నేను కూడా రాజకీయ నాయకున్నే కదా?. కిషన్ రెడ్డి మంచోడు, సౌమ్యుడు. ప్రాబ్లం ఏంటంటే.. ఆయన కూడా స్క్రిప్ట్ లీడర్. రాసి ఇచ్చింది చదువుతాడు. పొలిటికల్ స్పీచ్లు ఇవ్వలేడు. యూరియా మీరు ఇవ్వకుండా.. మాట్లాడితే ఏం లాభం. కేంద్రమే ఇవ్వాలి యూరియా. వేల కోట్లు రైతులకు ఇచ్చే రేవంత్ రెడ్డికి ఎరువులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందా?’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.