BSNL 5G: భారతదేశంలో 5G సేవల గురించి మాట్లాడుతూ.. జియో, ఎయిర్టెల్, VI తమ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) పేరు కూడా చేరబోతోంది. BSNL యొక్క 4G, 5G సేవల కోసం నిరీక్షణ త్వరలో ముగియనుంది. ఎందుకంటే, బిఎస్ఎన్ఎల్ 5G ప్రారంభానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బిఎస్ఎన్ఎల్ 2025 సంవత్సరంలో తన 5G సేవను ప్రారంభించవచ్చు. భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ 3.6 GHz, 700 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లపై తన 5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), కోర్ నెట్‌వర్క్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 5G సేవలు త్వరలో భారతదేశంలో ప్రారంభమవుతాయని ఆయన ధృవీకరించారు.
Also Read: US Election 2024: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన తొలి ట్రాన్స్‌జెండర్
అందిన ఓ నివేదిక ప్రకారం, బిఎస్ఎన్ఎల్ తన 5G సేవను వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాటికి ప్రారంభించవచ్చు. బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్. శ్రీను శనివారం మాట్లాడుతూ.. 4జీ సేవలను తదుపరి స్థాయికి అప్‌గ్రేడ్ చేసి నాణ్యమైన సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాట్లు చేస్తోందని.. టవర్లు, ఇతర పరికరాలను కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. కస్టమర్ కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వైఫైని కొనసాగించాలనే లక్ష్యంతో BSNL ‘సర్వత్ర వైఫై’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోందని అయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి డిప్యూటీ జనరల్ మేనేజర్ల బృందం నాయకత్వం వహిస్తుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా 4G సైట్‌లను ఇన్‌స్టాల్ చేస్తోంది. సమాచారం ప్రకారం ఇవి 2025 నాటికి 5Gకి అప్‌గ్రేడ్ చేయబడతాయి. BSNL 2025 మధ్య నాటికి 1,00,000 సైట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో ఇప్పటివరకు మొత్తం 39,000 సైట్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. స్వదేశీ 4G, 5G రెండింటినీ అమలు చేసిన దేశంలో BSNL మొదటి ఆపరేటర్ అవుతుంది.