Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ ఘటన సమయంలో భవనంలో ఆరుగురు నుంచి ఏడుగురు వరకు ఉండే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు భద్రాచలం లంబాడీ కాలనీకి చెందిన ఉప్పలయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ధృవీకరించారు. మిగిలిన వారిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భవనం పూర్తిగా శిధిలాలకుపోయిన కారణంగా, సహాయచర్యలు మెల్లగా కొనసాగుతున్నాయి.
భద్రాచలం పట్టణంలో జరిగిన ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరపున సింగరేణి రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు చేపట్టింది. శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన ఉప్పలయ్య తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీగా పనిచేస్తూ, అదనపు 500 రూపాయలు ఇస్తామనే ఆశతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. “నా ఇద్దరు పిల్లలు చిన్నవాళ్లు, వాళ్లను ఎవరు చదివిస్తారు?” అంటూ ఆయన భార్య కన్నీరుమున్నీరవుతోంది.
ఈ భవనం విషయంలో 120కి పైగా ఫిర్యాదులు అందినా, అధికారులు కనీసం పరిశీలించకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. “ఈ భవనం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని మేము ఎప్పుడో ఫిర్యాదు చేశాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు” అని తెల్లం నరేష్ అనే వ్యక్తి ఆరోపించారు.
భద్రాచలం మునిసిపల్ పరిధిలో అనుమతుల్లేకుండా ఇలాంటి భారీ భవనాలు నిర్మించడాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలనే డిమాండ్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటన భద్రాచలంలో నిర్మాణ నిబంధనల పాటింపు, అధికారుల నిర్లక్ష్యం, భవనాల భద్రతా ప్రమాణాలు గురించి పెద్ద చర్చను తీసుకువచ్చింది.
Amazon: అమెజాన్ కు బిఐఎస్ షాక్.. వేర్‌హౌస్‌పై దాడులు.. 2783 ఉత్పత్తులు సీజ్