Bengaluru Robbery: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ATM క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, CMS కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
READ ALSO: Prabhas: పెద్ద ప్లానింగే.. ప్రభాస్ ‘ప్రీక్వెల్’ ఫిక్సా?
అసలేం జరిగిందంటే..
నవంబర్ 19న, ఆర్‌బిఐ అధికారులుగా నటిస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఒక ఎటిఎం క్యాష్ వ్యాన్‌ను ఆపి సుమారు రూ.7 కోట్లతో పారిపోయారని పోలీసులు తెలిపారు. జెపి నగర్‌లోని ఒక బ్యాంకు శాఖ నుంచి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వాహనం నగదును రవాణా చేస్తుండగా ఈ దోపిడి జరిగింది. నిందితులు భారత ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి, పత్రాలను ధృవీకరించాలని చెప్పి వ్యాన్‌ను ఆపి, నగదుతో పాటు సిబ్బందిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు.
కమిషనర్ ఏం చెప్పారంటే..
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక CMS మాజీ ఉద్యోగి పాల్గొన్నట్లు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఆపరేషన్ కోసం పదకొండు బృందాలను ఏర్పాటు చేసి 200 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈక్రమంలో 30 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ఆరు బృందాలను అన్ని దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు వరకు వెళ్లాయని వెల్లడించారు. వీరిలో వెహికల్ ఇన్‌ఛార్జ్, సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ మాజీ ఉద్యోగి, గోవిందపుర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ ముఠా మూడు నెలల క్రితమే దోపిడీకి ప్లాన్ చేసిందని ఆయన తెలిపారు. వారు క్యాష్ వ్యాన్ వెళ్లే మార్గాన్ని పరిశీలించి, సీసీటీవీ కెమెరాలు లేని మార్గాన్ని దోపిడికి ఎంచుకున్నట్లు వెల్లడించారు.
READ ALSO: Al-Falah University: హోదాను ఎందుకు రద్దు చేయకూడదు.. జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు