BCCI Warning to Virat Kohli over Yo-Yo Test Score: ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్‌నెస్ (యో-యో టెస్టు) టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టును క్లియర్ చేశాడు. యో-యో టెస్టులో తాను 17.2 స్కోర్ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ఇదే ఇప్పుడు బీసీసీఐ ఆగ్రహానికి కోహ్లీ గురయ్యేలా చేసింది.
యో-యో టెస్టులో తాను 17.2 స్కోర్‌ను విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంను బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను నెట్టింట షేర్ చేయవద్దని కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందట. యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్‌ను విరాట్ పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు నచ్చలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోసారి ఇలా చేయొద్దని కోహ్లీని బీసీసీఐ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
‘జట్టుకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని భారత ఆటగాళ్లను హెచ్చరించాం. ప్లేయర్స్ తమ ట్రైనింగ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకోవచ్చు కానీ.. యో-యో టెస్టు స్కోర్‌ను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదు. అలా చేయడం ఆటగాళ్ల కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం’ అని బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాతో అన్నారు.
Also Read: Pakistan Captain: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా.. ఏకంగా పాకిస్తాన్ కెప్టెన్ అయ్యాడు!
వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్ అనంతరం విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు కుటుంబంతో గడిపిన కోహ్లీ.. ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023కి సిద్ధమవుతున్నాడు. ఎన్సీఏలో వారం రోజుల పాటు జరిగే ట్రెయినింగ్ క్యాంపులో భాగం అయ్యాడు. ఆసియా కప్ 2023లో భారత్ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. కోహ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.