శ్రీకాళహస్తిలోని పిన్ కేర్ అనే ప్రైవేట్ బ్యాంక్‌లో గురువారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు బ్యాంకులోకి వెళ్లి మహిళా ఉద్యోగులను బెదిరించి వాళ్లను బంధించారు. అనంతరం వాళ్ల దగ్గర లాకర్ రూమ్ తాళాలు తీసుకుని రూ.85 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దోపిడీ చేసిన అనంతరం దుండగులు బ్యాంకులోని సీసీ కెమెరా రికార్డులను కూడా ఎత్తుకుపోయినట్లు సిబ్బంది పోలీసులకు వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు దోపిడీకి పాల్పడి పరారైన నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీకాళహస్తీ కేసులో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారిస్తున్నామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ముగ్గురు దొంగలు రాత్రి బ్యాంకు మేనేజర్ కాళ్ళు, చేతులు కట్టేసి కత్తితో బెదిరించి దొంగతనం చేశారని ఆయన తెలిపారు. దాదాపు రూ.కోటికి పైగా విలువచేసే బంగారం, నగదు దోచుకెళ్ళారని వివరించారు. దొంగల కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వాళ్ల డబ్బు, బంగారం ఎక్కడికీ పోదని తిరుపతి ఎస్పీ ధైర్యం చెప్పారు.