Bank Robbery: కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో దొంగలు ఒక బ్యాంకులోకి చొరబడి ఏకంగా 59 కిలోల బంగారం దోచుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన విజయపుర తాలూకాలోని మంగోలీ గ్రామంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్‌తో దాడి.. చివరకి..?
బ్యాంక్ మే 23న సాయంత్రం బ్యాంకు తాళం వేసి మూసివేయబడింది. మే 24, 25 తేదీల్లో నాల్గవ శనివారం, ఆదివారం కావడంతో బ్యాంక్ సెలవు కాగా, మే 26న ఉదయం బ్యాంక్ క్లీనింగ్ కోసం వచ్చిన పియాన్ బ్యాంక్ షట్టర్ తాళాలు విరగబడ్డ విషయాన్ని గమనించి తెలిపాడు. ఆ తర్వాత మంగోలీ బ్రాంచ్ మేనేజర్ మే 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించగా.. దొంగలు రాత్రివేళలో బ్యాంక్ లోకి చొరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు తేలింది. బ్యాంక్ అధికారుల ప్రకారం బంగారం మొత్తం 59 కిలోలు ఉందని సమాచారం.
Read Also: Women’s World Cup 2025: మహిళల వరల్డ్ కప్ షెడ్యూల్, వేదికలు ఖరారు.. నవంబర్ 2న ఫైనల్..!
ఆ బంగారం బ్యాంక్ లో గోల్డ్ లోన్ కోసం ప్రజలు ఉంచిన బంగారం అని తెలుస్తోంది. ఈ ఘటనపై విజయపుర జిల్లా ఎస్పీ లక్ష్మణ్ బి. నింబార్గి మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. మే 24 రాత్రి నుంచి మే 25 మధ్యలో ఈ చోరీ జరిగినట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ భారీ దొంగతనం వార్త స్థానికంగా కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.