Bangladesh Hindu Killing: ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే టైంలో బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య చోటుచేసుకుంది. జషోర్ జిల్లాలోని మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ అనే హిందూ యువకుడిని పట్టపగలు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన సోమవారం (జనవరి 5) సాయంత్రం కోపాలియా బజార్ ప్రాంతంలో వెలుగు చూసింది. రాణా ప్రతాప్ అనే యువకుడు ఒక జర్నలిస్ట్. బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు దీపు దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్, ఖోకోన్ దాస్ అనే హిందువులు హత్యకు గురయ్యారు. ఇది 5వ హత్య.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ హిందూ యువకుడిపై దాడి చేసిన వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చారు. వారు రాణాను తన ఐస్ ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి మార్కెట్‌లోని ఒక క్లినిక్ సమీపంలోని సందులోకి తీసుకెళ్లారు. అక్కడ వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది, ఆ తర్వాత వారు రాణా తలపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. మనోహర్‌పూర్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అక్తర్ ఫరూఖ్ మింటు ఈ హత్యను ధృవీకరిస్తూ మాట్లాడారు. ఈ దాడి చేసిన వ్యక్తులు రాణాను ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకెళ్లి, చంపి ఆపై మణిరాంపూర్ వైపు రోడ్డు నుంచి పారిపోయారని చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏడు ఖాళీ బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజా మారణహోమంపై ఆ ప్రాంతంలోని హిందూ సమాజం తీవ్రమన ఆగ్రహాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. స్థానిక యంత్రాంగం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది, కానీ హంతకులను గుర్తించడం లేదా అరెస్టు చేయడం గురించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత గురించి మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తినట్లు అయ్యింది.
ఇదే టైంలో వార్తాపత్రిక న్యూస్ ఎడిటర్ అబుల్ కాసిం మాట్లాడుతూ.. “రాణా ప్రతాప్ మా యాక్టింగ్ ఎడిటర్. ఒకప్పుడు అతనిపై కేసులు నమోదైనప్పటికీ, అన్ని కేసుల్లో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ హత్యకు దారితీసిన విషయం నేను చెప్పలేను” అని అన్నారు. సంఘటన స్థలంలో మణిరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ (OC) రజియుల్లా ఖాన్ మాట్లాడుతూ.. ” మాకు సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం మార్చురీకి పంపాము. ఈ సంఘటనకు కారణం అయిన వారిని కచ్చితంగా పట్టుకుంటాం” అని అన్నారు.
READ ALSO: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?