Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో 2026 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తు జాబితా నుంచి కమలం చిహ్నాన్ని తొలగించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ కమలం గుర్తును తమ పార్టీకి కేటాయించాలని ఎన్నికల సంఘంకి విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఈ NCP కి చెందిన నాయకులు కీలకంగా వ్యవహరించారు. తాజా పరిణామాలతో దేశంలో పరిస్థితులు ఎలా మారనున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: GST Effect: టీవీల నుంచి కార్‌ల వరకు తెగ కొనేస్తున్నారు.. జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఆల్-టైం హై షాపింగ్..
1971లో స్వాతంత్య్రం.. 2021లో చివరి ఎన్నికలు..
భారతదేశం చొరవతో 1971లో స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్‌లో చివరిసారిగా 2021లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ అఖండ విజయం సాధించింది. అయినప్పటికీ దేశంలో చెలరేగిన అల్లర్ల కారణంగా ఆమె ప్రభుత్వం కూలిపోయింది. తాజాగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో దేశంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
కమలం కథ ఏంటి..
దేశంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన కొన్ని నెలల తర్వాత.. జూలైలో నిరసనకారులకు నాయకత్వం వహించిన నాయకులు నేషనల్ సిటిజన్స్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి నహిద్ ఇస్లాం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈక్రమంలో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఇస్లాం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆయన ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఎన్నికల గుర్తుగా కమలం కేటాయించాలని అభ్యర్థించారు. బంగ్లాదేశ్‌లో కమలాన్ని షపాల అని పిలుస్తారు. ఇస్లాం అభ్యర్థనపై కమిషన్ ఆ సమయంలో స్పందించలేదు. తాజాగా కమలం ఎన్నికల గుర్తు జాబితాలో లేదని కమిషన్ పేర్కొంది. ఈ గుర్తుతో సమస్య ఉందని, అందుకే దానిని పరిష్కరించడానికి ఎన్నికల జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల కమిషన్‌కు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తాం..
ఎన్నికల కమిషన్ ప్రకటనపై నహిద్ ఇస్లాం పార్టీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో “కమలం గుర్తు లేకుండా ఎన్నికల కమిషన్ దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందో చూద్దాం” అని పేర్కొంది. బంగ్లాదేశ్ జాతీయ పుష్పం తెల్ల కమలం. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కూడా కమలం బాగా ప్రచారం పొందింది. ఆ సమయంలో ప్రముఖ తిరుగుబాటు నాయకులు తమతో పాటు కమలాన్ని తీసుకెళ్లారు. ఈ గుర్తు ప్రజలకు సుపరిచితం కాబట్టి నహిద్, ఆయన పార్టీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి. అంతేకాకుండా నహిద్ ఈ గుర్తును పొంది తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.