బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది.
గత ఏడాది డిసెంబర్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జహనారా ఆలమ్ చివరిసారిగా ఆడింది. బంగ్లాదేశ్ దినపత్రిక కలేర్ కాంథోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహనారా మాట్లాడుతూ… ‘ఇది కొత్తేమీ కాదు. నిగర్ సుల్తానా జూనియర్లను బాగా కొడుతుంది. వన్డే ప్రపంచకప్ 2025 సమయంలో కూడా జూనియర్లను చెంప దెబ్బలు కొట్టింది. ఈ విషయం బాధితులే స్వయంగా నాతో చెప్పారు. దుబాయ్ టూర్ సమయంలో ఒక జూనియర్‌ని గదిలోకి పిలిచి చెంపదెబ్బ కొట్టింది. నిగర్ సుల్తానాకు కోపం ఎక్కువ. మళ్లీ ఆ తప్పు చేయను అని ప్లేయర్స్ చెప్పినా వినదు. కొడుతూనే ఉంటుంది’ అని వివరించింది.
Also Read: IND vs AUS: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?
‘జట్టు ఎంపికలో పక్షపాతం, రాజకీయాలు ఎక్కువగ ఉంటాయి. బాధితుల జాబితాలో నేను ఒక్కదానినే లేను. జట్టులోని ప్రతిఒక్కరూ బాధితులే. అందరి సమస్య భిన్నంగా ఉంటుంది. ఒకరిద్దరికి మాత్రమే మంచి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకరికి మాత్రమే అన్నీ ఇవ్వబడతాయి. 2021లో నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలో నేను మూడు జట్లలో ఒకదానికి కెప్టెన్. మిగతా రెండింటికి నిగర్, షర్మిన్ ఉన్నారు. అప్పుడే సీనియర్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు వాతావరణం క్షీణించింది. మానసిక ఒత్తిడి కారణంగా క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా’ అని జహనారా ఆలమ్ చెప్పింది. జహనారా బంగ్లాదేశ్ తరఫున 52 వన్డేల్లో 48 వికెట్లు, 83 టీ20ల్లో 60 వికెట్లు పడగొట్టింది. అయితే బీసీబీ మాత్రం జహనారా వ్యాఖ్యలను ఖండించింది. జహనారా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపడేసింది.