బండ్లగూడలో దారుణం చోటుచేసుకుంది. ఇళ్లు ఖాళీ చేయమన్నందుకు ఓ వ్యక్తి యజమానురాలిపైనే దాడి చేశాడు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ వచ్చి వీపులో పిడి గుద్దులు గుద్దాడు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా చేయడం లేదని, పైగా తనపై దాడి చేశాడని సారాదు యజమానురాలు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళితే…
హాషామాబాద్‌కు చెందిన యజమానురాలైన జ్యోతి తన ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్‌ను రూ.5 లక్షలకు మహా రాష్ట్రకు చెందిన ముస్తాక్ అహ్మద్ ఖాన్ (47)కు కుదవ పెట్టింది. మొదటి అంతస్థులో జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఇటీవల ఇంట్లోని బంగారంతో పాటు నగదు చోరీకి గురౌతుండడంతో.. జ్యోతి మొదటి అంతస్తులో గ్రిల్ ఏర్పాటు చేసుకుంటోంది. దానిని ముస్తాక్ అహ్మద్ ఖాన్ అడ్డుకున్నాడు. ఇల్లు నాదంటూ మీడియా పేరుతో బెదిరించడమే కాకుండా.. యజమానురాలు జ్యోతిని జుట్టు పట్టి వీధిలోకి ఈడ్చుకొచ్ఛాడు. వీపులో పిడి గుద్దులు గుద్దాడు. చుట్టుపక్కల వారు ముస్తాక్‌ను అడ్డుకున్నారు.
ఈ ఘటనపై బాధితురాలు జ్యోతి బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుణం కింద తీసుకున్న రూ.5 లక్షల్లో ఇప్పటికే రూ.2 లక్షలు తిరిగి ఇచ్చానని.. మిగతా రూ.3 లక్షలు ఇస్తానని ఇల్లు ఖాళీ చేయమని చెప్పినా చేయడం లేదని బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ముస్తాక్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమపైనే దాడి చేసిన ముస్తాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జ్యోతి కుటుంబసభ్యులు కోరుతున్నారు.