NTV Telugu Site icon

Bandi Sanjay : మీరు విచారణ చేస్తూ… మమ్ముల్ని అరెస్ట్ చేయమంటారా?

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగ్ ల్లో పాల్గొంటూ అబద్దాలాడుతూ, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఢోకా లేదు… నాకేం ఫరఖ్ లేదని బుకాయిస్తున్నాడని, అంత ధీమా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చినట్లు? చరిత్రలో ఇంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎన్నికల్లో పాల్గొంటూ డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. దీనికితోడు ఓడిపోతే మీ సమస్యలను పరిష్కరించబోనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు బండి సంజయ్‌.

అంతేకాకుండా..’ఇవాళ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాంలపై మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే… ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తోంది. లా అండ్ ఆర్డర్ రాష్ట్రం పరిధిలోనిది. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు స్కాంలు చేసింది రాష్ట్రంలోనే… దొచుకున్న సొమ్మంతా తెలంగాణ ప్రజలదే. విచారణ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే. కొంత మంది నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వమే. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుని మీరేందుకు అరెస్ట్ చేయలేదని కేంద్రాన్ని నిందించడం చూస్తుంటే నవ్వొస్తుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు పోతే…. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఆయా స్కాంల సూత్రధారులు తెలంగాణలోనే ఉన్నారు కదా? మరి వాళ్లను ఇన్నాళ్లుగా ఎందుకు అరెస్ట్ చేయలేదు?

అన్ని ఆధారాలున్నాయని చెబుతూ రాధాకిషన్ రావుసహా కొందరు అధికారులను అరెస్ట్ చేసి 10 నెలలకుపైగా జైల్లో ఉంచిన మీరు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పైకి తిడుతున్నట్లుగా ఉంటూ నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అరెస్ట్ కాకుండా కాపాడుతూ ఆయా కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా? మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, గొర్రెల స్కాం, కాళేశ్వరం, కేటీఆర్ బామ్మర్థి డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయండి. ఆయా కేసుల్లో దోషులెవరైనా అరెస్ట్ చేసి బొక్కలో వేయించే బాధ్యత కేంద్రం తీసుకుంటది. రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా న్యాయ స్థానాల ఆదేశాలు లేకుండా సీబీఐ తనంతట తాను విచారణ జరిపే అధికారం లేదని తెలిసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రంపై బురద చల్లడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనం.

బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ముఖ్యమంత్రి అర్ధ సత్యాలు, అబద్దాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని, ఆ సంఖ్యను 46 శాతానికి ఎట్లా తగ్గిస్తారని అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులే చెప్పారు. మరి ఆనాడెందుకు ముస్లిం జనాభా గురించి సీఎం నిలదీయలేదు? రాష్ట్రంలో ఉన్న ముస్లింల్లో 80 శాతం మందిని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసి నిజమైన బీసీ బిడ్డల పొట్టకొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? బరాబర్ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం. బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి బీసీ బిల్లు పంపితే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మేం తీసుకుంటాం.’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

 Telangana: విద్యార్థులకు అలర్ట్‌.. లాసెట్, పీజీఎల్‌సెట్, ఈసెట్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల