రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం సమంజసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. “ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేస్తారు. అదే టైంకి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తరువాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు కరెక్ట్? ఒక వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మార్చడం న్యాయమా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
READ MORE: Anchor Suma: అతి అరుదైన కృష్ణ శిలలతో టాలీవుడ్ నిర్మాత శివాలయం.. సుమ ప్రత్యేక పూజలు
తబ్లీఘీ జమాత్ వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ మన రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. “రంజాన్ కు డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు. రంజాన్ కు బహమతులు అందిస్తారు. మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు. కానీ అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడం లేదు. హిందూ పండుగలకు ప్రత్యేక నిధులూ కేటాయించరు. పైగా నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే? హిందువులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలి. విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైం టేబుల్ ను మార్చాలి.” అని కేంద్ర మంత్రి ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.