ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది. ఆలోపే ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి’’అని సూచించారు. రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని, 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తీసుకొచ్చి జీతభత్యాలు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే కేంద్రం వద్దకు వెళ్లి తెలంగాణకు అధిక నిధులు తీసుకొచ్చేందుకు అవకాశముందన్నారు. ‘‘బీజేపీ వైపు రాముడు, మోడీ ఉన్నాడు… కాంగ్రెస్ వైపు రాహుల్, రజాకార్లు, కేసీఆర్ ఉన్నారని దుయ్యబట్టారు. ఎవరు ఏ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి.. రాముడి వారసుడైన మోడీ రాజ్యం కావాలా? రజాకార్ల రాజ్యం కావాలా? ఆలోచించండి’’అంటూ ప్రజలను కోరారు.
కొమురం భీం విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్.. స్థానిక ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో కలిసి వెయ్యి ఊడల మర్రిని సందర్శించారు. రాంజీగోండు స్మారక కేంద్రం వద్ద ఒక వర్గానికి చెందిన వ్యక్తి సమాధి ఉండటంతో స్థానికులంతా బండి సంజయ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లి రాంజీగోండు స్ర్ముతి కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుండి బీజేపీ నేతలతో కలిసి బోథ్ నియోజకవర్గం వెళ్లిన బండి సంజయ్ విజయ సంకల్ప యాత్ర రథమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ నెరడిగొండ, ఇచ్చోడకు వచ్చారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారని మనమెవరం ఊహించలేదని.. కరసేవకుల త్యాగాలు వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆ కలను నెరవేర్చిన మహనీయుడు నరేంద్రమోదీ అని అన్నారు. ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన ఘనత మోడీదేనని తెలిపారు. ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్న నాయకుడు మోడీ.. దీంతోపాటు వేలాది కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాడు.. కోట్లాది గ్యాస్ కనెక్షన్లు, టాయిలెట్లు నిర్మించిన నేత మోడీ అని పేర్కొన్నారు. మరోవైపు.. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు పనీపాట లేదు.. కొత్త స్కాచ్ బాటిల్ టేస్ట్ చూడటానికే ఢిల్లీ వెళుతున్నాడని విమర్శించారు. ఆయనతో చర్చలు జరపాల్సిన కర్మ బీజేపీకి లేదని.. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ తో పొత్తు పెట్టుకోలేదు.. ప్రజలు ఛీత్కరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ తమకెందుకు అని అన్నారు.