టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టండని, కుల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కార్యకర్తలకు సూచనలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పోలింగ్ సమయం నాటికి ప్రతి ఇంటికీ 3, 4 సార్లు వెళ్లి బీజేపీకి ఓటేసేలా ప్రచారం చేయండన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి శాంతికుమార్ తదితరులతో ఈరోజు ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై బండి సంజయ్ చర్చించారు. దీంతోపాటు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార, పోలీస్ యంత్రాంగాన్ని కేసీఆర్ ఫ్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపైనా చర్చించారు.
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… తాము చేసిన అభివ్రుద్దే టీఆర్ఎస్ ను గెలిపిస్తుందని ఇన్నాళ్లూ ప్రచారం చేసుకున్న కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలకు మునుగోడు ఎన్నికలొచ్చేసరికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఎలాగైనా మునుగోడు ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్దమయ్యారని, అధికార, పోలీస్ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. అందులో భాగంగా కుల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని కోరారు. శక్తి కేంద్రాల ఇంఛార్జీల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ సమయం నాటికి ప్రతి ఇంటికీ 3, 4 సార్లు వెళ్లి బీజేపీకి ఓటేసేలా ప్రచారం చేయాలని కోరారు.