NTV Telugu Site icon

Bandi Sanjay: బండి సంజయ్ లోకల్.. వినోద్ వలస పక్షి..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్‌కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు సహకరించిందే కేసీఆర్ అంటూ బండి సంజయ్‌ పేర్కొన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి వినోద్ కుమార్ అంటూ ఆయన ఆరోపించారు. అయినా ఆయన్ని నిజాయితీ పరుడు అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై సహారా, ఈఎస్‌ఐ కేసులు కూడా ఉన్నాయని.. అందుకే నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్‌ని తొలగించారని ఆయన ఆరోపణలు చేశారు.

Read Also: Shabbir Ali: సీఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదు..

కనీసం పార్లమెంట్ కూడా రాకపోతే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ రాజీనామా చేయమన్నారని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని కప్పి పుచ్చేందుకు జైతెలంగాణ అని రాజీనామా చేశాడన్నారు. స్మార్ట్ సిటీ ఇచ్చింది బీజేపీ.. నిధులు తెచ్చింది బండి సంజయ్ అని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ముఖం పెట్టుకుని వినోద్ ఓట్లు అడిగితే లక్షణంగా లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. బండి సంజయ్ లోకల్… వినోద్ వలస పక్షి అని అన్న ఆయన.. వలస పక్షి వినోద్ కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సంపాదించేందుకు పోటీ చేస్తున్నారని విమర్శించారు. వినోద్ ఏమి చేయకుండానే తాను చేసాను అంటూ మోసం చేయడం వినోద్‌కు అలవాటన్నారు. పార్లమెంట్‌లో 106 సార్లు మాట్లాడిన అంటున్న వినోద్.. చేసిన పనులు ఎన్ని సాధించిన ప్రగతి ఏంటని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Read Also: Narsingi: రైతుబజారు పేరిట గుటకాయ స్వాహా.. సర్కారు ఆదాయానికి గండి

స్మార్ట్ సిటీ నేనే తెచ్చాను అని వినోద్ కుమార్ చెప్పుకుంటున్నారని.. అందరం కలిస్తేనే కరీంనగర్‌కి స్మార్ట్ సిటీ వచ్చిందన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులని కేసీఆర్ పక్కదోవ పట్టిస్తే ఎందుకు వినోద్ మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా, కేంద్రం లేఖలకు స్పందించకుండా ఆ రోజు కేసీఆర్ డ్రామాలు చేస్తే వినోద్ ఎందుకు మాట్లాడలేదన్నారు. బండి సంజయ్ కరీంనగర్ లోకల్ కాబట్టి స్థానిక సమస్యలపై మాట్లాడే దమ్ము ఉందన్నారు. వినోద్ లోకల్ కాదు కాబట్టి కనీస అవగాహన లేదన్నారు. కరీంనగర్ వరంగల్ రోడ్డుకి 2 వేల కోట్ల నిధులు కేంద్రం ఇస్తే నేనే చేశాను అంటూ అబద్దాలు ఆడుతున్నారన్నారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీకి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోతే వేరే స్కీం పెట్టి తాను బ్రిడ్జి తెచ్చానన్నారు. వరంగల్-కరీంనగర్ రోడ్డు మీద తన కళ్ళ ముందు ప్రమాదాలు జరిగాయన్నారు. వెంటనే గడ్కరీ వద్దకు వెళ్లి రోడ్డు విస్తరణ నిధులు తెచ్చానన్నారు. తమ బంధువుల ప్రయోజనాల కోసం కరీంనగర్‌కు మెడికల్ కాలేజీ రాకుండా చేసింది కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు.

కాళేశ్వరంలో 8 పిల్లర్లు ధ్వంసం అయితే చిన్న లోపం అంటావా అంటూ ఆయన మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రకటించిన కార్పొరేషన్‌ల ఏర్పాటు లాగే ఇప్పుడు కూడా ఉందని ఆయన విమర్శించారు. ఎన్నికల కోసమే ఈ కార్పొరేషన్ల ప్రకటన చేశారన్నారు. కార్పొరేషన్ల వల్ల ఏం ఒరుగుతుందో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ హామీల విషయంలో మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి లేరన్న ఆయన.. తెలంగాణలో 12 నుంచి 15 స్థానాలు గెలుస్తామన్నారు. నీటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయని.. రైతుల కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నామన్నారు.