బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని సూచించారు.”తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే.. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందే.. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే.. ఊరుకునేది లేదు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి.” అని సంజయ్ తెలిపారు.
READ MORE: Asaram Bapu: అత్యాచార దోషి ఆశారాం బాపునకు మధ్యంతర బెయిల్
ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి.. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చింది. ఇక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.