Bandi Sanjay : ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ ను మించి పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని చెప్పారు. ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. అట్లాగే వ్రుద్దులకు రూ.4 వేలు, పేదలకు ఇండ్ల జాగా, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు పేరుతో లక్ష కోట్లకుపైగా బకాయి పడిందన్నారు. ఈ సొమ్ముంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గంగిడి మనోహర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమాదేవి, జెనవాడ సంగప్ప, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మలతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్బంగా ఏమన్నారంటే….
ఆ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితే… ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతది. అమెరికాలాంటి దేశంలో కూడా మొదట ఈ మూడు రంగాలు బాగుపడిన తరువాతే.. ఆ దేశం అగ్రదేశమైంది… అందుకే నరేంద్ర మోదీ గారి సారధ్యంలో ఆయా రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. ముఖ్యంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా మన తెలంగాణకు మోదీ ప్రభుత్వం అత్యధిక నిధులిస్తోంది.
గత పదేళ్లలో మోదీ సారథ్యంలో గడ్కరీ గారి ఆశీస్సులతో రోడ్ల విస్తరణ కోసం లక్ష కోట్లు కేటాయించింది. ఇయాళ తెలంగాణలో ఏ మూలకు పోవాలన్నా రెండు గంటల్లో రయ్ రయ్ మంటూ వెళ్లే అవకాశం ఏర్పడిందంటే అది మోదీ గారి ఘనతే కదా… అంతెందుకు కేంద్రమే రూ.18 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ ను నిర్మిస్తున్నం… గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ నిధుల ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లను విస్తరిస్తున్నాం…
ఇగ రైల్వేల అభివ్రుద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నం. గత పదేళ్లలో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినం. ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్ లోనే రూ.5 వేల 336 వేల కోట్లు తెలంగాణకు కేటాయించినం. చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ కేటాయించలేదు. దటీజ్ మోదీ. ఒక్కసారి సికింద్రాబాద్ చూసి రండీ. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ను ఎట్లా వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నడు. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారుస్తున్నం. అంతెందుకు రేపు చర్లపల్లి కొత్త టెర్మినల్ ను మోదీ గారు వర్చువల్ గా ప్రారంభించబోతున్నరు. స్వాతంత్ర్యం వచ్చాక తెలంగాణలో మొట్టమొదటి నూతన టెర్మినల్ చర్లపల్లి మాత్రమే. రేపటి నుండి రెగ్యులర్ గా 24 ట్రైయిన్స్ చర్లపల్లి నుండి రాకపోకలు సాగించబోతున్నయ్. అట్లాగే గూడ్స్ రైళ్లన్నీ అక్కడి నుండే నడవబోతున్నయ్. దీనిద్వారా వ్యాపార, వాణిజ్య రంగానికి ఊతం కాబోతోంది. ఇప్పటికే అమ్రుత్ కింద 44 రైల్వే స్టేషన్ లను ఆధునీకరించబోతున్నం. 5 వందే భారత్ ట్రెయిన్లు నడుస్తున్నయ్… ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నయ్.
మోదీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి తెలంగాణను అభివ్రుద్ధి చేస్తుంటే… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పొలిటిక్స్ చేస్తూ ప్రజలను దగా చేస్తోంది. 70 ఏళ్లుగా భారతదేశాన్ని అబద్దపు మాటలతో, మోసపు హామీలతోనే మోసం చేసింది. ఇప్పుడు కూడా అంతే… 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నరు… కానీ ప్రతినెలా ఏదో ఒక ఎమోషనల్ పోలిటిక్స్ ను తెరపైకి తెచ్చి హామీలను ఏడాదిపాటు ఎగ్గొట్టింది. అధికారంలోకి రాంగనే కాళేశ్వరంపై కమిషన్ అన్నరు.. ఒక నెల రోజులపాటు ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపించిర్రు. ఇంకో నెల ఫాంహౌజ్ అంటరు… ఇంకో నెల డ్రగ్స్ కేసు అన్నరు… ఇంకోసారి విద్యుత్ కమిషన్ అన్నరు.. ఇప్పుడేమో ఫార్ములా ఈ కార్ రేస్ అంటూ వార్తలు రాయించుకుంటున్నరు.. ఈ విధంగా 6 గ్యారంటీలవైపు ప్రజల ద్రుష్టి మళ్లకుండా చాలా చాకచక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేసింది. ఎందుకంటే ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ కు గురువు కేసీఆరే. ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తోంది…
ఇగ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తలమీదకు వచ్చినయ్. ఎందుకంటే మార్చిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే 15వ ఆర్దిక సంఘం నుండి రావాల్సిన 2 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోతయ్. అందుకే ఇప్పుడు రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది. తెలంగాణ ప్రజాలారా… కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకండి. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలిస్తాననని నిండా ముంచిండు…. కాంగ్రెస్ కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నయని మోసం చేయడానికి సిద్ధమైంది. 70 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు 10 వేల చొప్పున మొన్నటి వరకు రైతు బంధు పడింది. కాంగ్రెసోళ్లు 15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇస్తే రైతులంతా ఓట్లేసి గెలిపించిర్రు. అధికారంలోకి వచ్చాక ఏడాది పైసలను ఎగ్గొట్టిర్రు. ఇప్పుడేమో ఎకరాకు 12 వేలు మాత్రమే ఇస్తానంటూ కోతలు పెడుతున్నరు. నమ్మి ఓటేస్తే మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ లెక్కన చూసినా గడిచిన ఏడాది బకాయి. రాబోయే రబీ సీజన్ పైసలు కలిపితే ఎకరాకు 18 వేల చొప్పున రైతుకు బకాయి ఉన్నరు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ ఇస్తమన్నరు. ఈ లెక్కన రైతులందరికీ 12 వేల 600 కోట్లు ఇయ్యాలే. జనవరి 26న ఆ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తరా? లేదా? స్పష్టం చేయాలే. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలే. అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ స్తామని సన్నబియ్యానికే పరిమితం చేశారు. అది కూడా 5 శాతం మంది రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకున్నరు.
అట్లాగే నిరుద్యోగులకు నెలకు 4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నరు. ఏడాదైంది. 48 వేలు బకాయి పడ్డరు. ఈ లెక్కన 40 లక్షల మంది నిరుద్యోగులకు 19 వేల 200 కోట్లు ఇయ్యాలే… మరి ఆ సొమ్ము ఎప్పుడిస్తరు? జనవరి 26న నిరుద్యోగులకు ఆ పైసలిస్తరా? లేదా? స్పష్టం చేయాలే…
అట్లాగే మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున 1 కోటి మంది మహిళలకు ఏడాదిగా 30 వేల రూపాయలు బకాయి పడ్డరు. ఈ లెక్కన కోటి మందికి కలిపితే 30 వేల కోట్లు బకాయి పడ్డరు.
ఇంకా తులం బంగారం, స్కూటీ పైసలు లెక్కకట్టనేలేదు.. ఇగ విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, ఇల్లు లేని పేదలకు ఇంటిజాగా, రూ.5 లక్షలు, వ్రుద్దులు, వితంతవులకు 4 వేల పెన్షన్ పైసలు లెక్క కడితే… ఇంకో లక్ష కోట్ల రూపాయల బకాయి పడ్డరు.. ఇవన్నీ జనవరి 26న చెల్లిస్తరా? లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేయాలే…. ఎందుకంటే మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి… ఆ డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత మీదే…
నేనడుగుతున్నా… అసలు ప్రభుత్వం దగ్గర పైసలెక్కడియి? నయాపైసా లేదు. ఈ నెల జీతాలు కూడా సక్కగ ఇయ్యలే. ఫస్ట్ తారీఖు ఇస్తానని ఇంకా వాయిదాల పద్దతిలో జీతాలిస్తున్నరు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమని అప్పులు తెస్తున్నరు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీరు 70 వేల కోట్లదాకా అప్పు తెచ్చింది. గత మూడు నెలలుగా ప్రతి నెలా 10 వేల కోట్ల అప్పు తెస్తోంది. అంటే బడ్జెట్ లో ఈ ఏడాది 57 వేల కోట్లు మాత్రమే అప్పు తెస్తామన్నరు. కానీ ఇప్పటికే ఆ లిమిట్ దాటేసిర్రు. ఇంకా 30 వేల కోట్లు కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిర్రు. అంటే ప్రతినెలా 10 వేల కోట్ల చొప్పున 60 నెలల పాటు 6 లక్షల కోట్లకుపైగా అప్పు తీసుకురావాలని సిద్ధమైంది. ఈ లెక్కన కేసీఆర్ కు, మీకు తేడా ఏముంది? మరి మీరు ప్రజలను ఉద్దరించేదేముంది? మీరిద్దరూ కలిసి తెలంగాణను శ్రీలంక లెక్క మారుస్తున్నరా?
ఈసారి రైతు భరోసా పైసలు ఇయ్యడం కోసం TSIIC భూముల తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చిర్రు… ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడానికి నువ్వెవడివి? పోనీ ఈసారి ఆ భూములను తాకట్టు పెట్టి జనానికి పంచుతున్నవ్. మరి వచ్చేసారి ఎక్కడి నుండి పైసలు తెస్తవ్? ప్రజలారా… అర్ధం చేసుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే రైతు భరోసా సొమ్ము చెల్లించబోతున్నరు. ఆ ఎన్నికలైపోయిన వెంటనే రైతు భరోసా బంద్ పెట్టబోతున్నరు. ఎందుకంటే పైసలే లేవు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు…
పోనీ భూములు తాకట్టు పెట్టి తెచ్చిన పైసలు రేపు కట్టకపోతే ఆ భూములను బ్యాంకులు స్వాధీనం చేసుకుంటయ్. మరి నువ్వు రైతులకు ఒరగబెట్టిందేమిటి? ఆల్రెడీ చిప్ప చేత పట్టుకుని ఉన్నవ్. అయితే కేంద్రమైనా సాయం చేయాలే… లేకుంటే.. భూములను తాకట్టు పెట్టాలే… ఇంతకుమించి నువ్వు చేసిందేమిటి? మూసీ సుందరీకరణ కు అప్పు కోసం ఆర్బీఐ, ప్రపంచ బ్యాంకును సంప్రదించినవ్. కేంద్రం సిఫారసు చేస్తేనే ఆ అప్పులు పుడతయ్.
నీ ఏడాది పాలనలో తెలంగాణలో ఉత్పాదకత పెంచడానికి, ఉద్యోగాల కోసం, యువత కోసం ఏమైనా చేసినవా? మీకు, మీ కుటుంబానికి అవసరమైన రియల్ ఎస్టేట్ మాఫీయా దందా చేయడం తప్ప నువ్వు ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? 15 రోజులకో మాయ చేయడం… మర్చిపోవడం తప్ప సాధించేదేముంది? మీకు తెలిసిందల్లా ఢిల్లీకి కప్పం కట్టడం తప్ప చేస్తుందేమిటి?
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తామన్నరు. ఏమైంది? అమలు చేస్తారా? లేదా? స్పష్టం చేయాలి.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలకు కప్పం కట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం సాధించేదేమిటి? ప్రతి పనికి, బిల్లుకు 14 శాతం కమీషన్లు దొబ్బుకోవడమే పనిగా పెట్టుకున్నరు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు.
ఆరోగ్య శ్రీ బకాయిలు కట్టడం లేదు. ఇగ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది. ఈ మధ్య హైదరాబాద్ లో రెయిన్ బో ఆసుపత్రిలో రోగులు చేరితే లక్షల రూపాయలు బిల్లుల పేరుతో దోచుకుంటున్నరు. ఇదేం దోపిడీ. చిన్న చిన్న రోగాలకు కూడా లక్షల బిల్లులు వేసి ప్రజల రక్తం పీలుస్తున్నరు. అయినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?
ప్రజలారా…వాస్తవాలు గమనించాలని కోరుతున్నా… కాంగ్రెస్ అభయ హస్తమంటేనే భస్మాసుర హస్తం. కాంగ్రెస్ కు గుణపాఠం చెబితేనే ఆ పార్టీకి బుద్ది వస్తది… అట్లాగే ఆర్ధిక పరిస్థితి తెలిసే కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చినందున ఆ హామీలను అమలు చేసేదాకా కొట్లాదాం.
అట్లాగే మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీల్లో అభివ్రుద్ధి నిధులు నడుస్తున్నయ్. ఇగ బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీజీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు….
కేసీఆర్ ఇచ్చిన మాట జవదాటరేమో… ఓడిస్తే ఫాంహౌజ్ కే పరిమితం అవుతానన్నడు.. సిగ్గుండాలే. ఫాంహౌజ్ కే పరిమితమైతే మరి ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఎందుకు తీసుకోవాలే. ఆ పదవికి రాజీనామా చేసి ఇంట్లో పండొచ్చు కదా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు స్పందించకపోతే, పోరాడకపోతే నువ్వేం ప్రతిపక్షనేతవు? మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినవ్ కదా… ఆయన చనిపోతే కూడా వెళ్లవైతివి. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెడుతున్నం..రమ్మని పిలిచినా వెళ్లవైపోతివి. అసలు చేతగాని నీకు ప్రతిపక్ష పదవి ఎందుకు? ఆ పదవిని హరీష్ రావుకు ఇవ్వు. బీసీలకు ఇయ్యాలంటే గంగులకో, తలసాని శ్రీనివాస్ యాదవ్ కో ఇవ్వు. లేదా రెడ్డికి ఇవ్వాలనుకుంటే జగదీష్ రెడ్డికి ఇవ్వు… కేసీఆర్… నీ పార్టీ పనైపోయింది. నీ రాచరిక పాలన అంతమైంది?
గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులివ్వడం లేదని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ…. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దమా? ఇదే అంశంపై ఎన్నికలకు పోదామా? గ్రామాల వారీగా ఏ పథకానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో ప్రజల్లోకి వెళదామా?
తెలంగాణ సహా ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీలను ఓడిస్తారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే. లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యం.