Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవినీతి బయట పెడతానన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతిని బయటపెడతానని మంత్రి పొన్నం అంటున్నారు కదా, వెంటనే విచారణ చేపట్టాలి, లేకపోతే పొన్నం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము కొట్లాడేది ప్రజాసమస్యలపై అని, లాఠీ దెబ్బలు కూడా తిన్నామని, మాపై కేసులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ మెడలు వంచింది తామేనని అన్నారు. కానీ ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తోందని.. కానీ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు.
Read Also:Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంత మంది మహిళల అకౌంట్‌లో డబ్బులు వేశారు, ఎంత మంది అకౌంట్స్‌లో ఆసరా పెన్షన్లు ఇచ్చారు.. ఎంత మంది రైతుల అకౌంట్‌లలో రైతు భరోసా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు లేకుండా కొనుగులు కేంద్రాలు ప్రారంభం చేశారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. వీటి మీద మాట్లాడితే ప్రజలు సంతోషిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్, కేటీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాళ్లకు కేవలం బండి సంజయ్‌ను ఓడించాలనే ఒప్పందం ఉందని ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రిని తిట్టినా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. .బండి సంజయ్‌ను మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడదు, వినబడదని ఎద్దేవా చేశారు.