Balineni Srinivasa Reddy: ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు. అర్హుల ఎంపికలో పార్టీలను చూడలేదు, ఎవరి ప్రమేయం లేదన్నారు. పేదలకు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఒంగోలులో పోటీ కూడా చేయనని చెప్పానన్నారు. ఇబ్బందుల్లో కూడా ముఖ్యమంత్రి పట్టాల కోసం భూముల కొనుగోలుకు నిధులు విడుదల చేశారని.. మన మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో ఆయన నిధులు విడుదల చేశారని బాలినేని పేర్కొన్నారు.
Read Also: Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు
అప్పుడేమో పట్టాలు ఇవ్వరు అన్నారు.. పట్టాలు ఇచ్చాక దొంగ పట్టాలు ఇస్తున్నారు అంటున్నారని మండిపడ్డారు. వాళ్ళు కట్టిన టిడ్కో ఇళ్లు మీ ఇళ్ళ పక్కన కట్టారా అంటూ విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు. మేము పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఇచ్చామన్నారు. ప్రతీ ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతీ లబ్దిదారుడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. మాట తప్పి వెనకడుగు వేసే రాజకీయాలు చేయమన్నారు. పదిసార్లు చెబితే అబద్ధాలు నిజాలు అవుతాయన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మీకు దమ్ముంటే పట్టాలు కరెక్ట్ కాదని నిరూపిస్తే పోటీ కూడా చేయనని సవాలు చేస్తున్నానన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు.. సీఎం వచ్చి పట్టాలు ఇచ్చి వెళ్తే దొంగ పట్టాలు అనటం కరెక్ట్ కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.