Rega Kanta Rao : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వరంగల్‌లో భారీగా రజోత్సవాలు, గులాబీ పండుగ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ సాధనకు 60 ఏళ్లుగా కృషి చేసిన కేసీఆర్ నాయకత్వంలో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభను అడ్డుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంతారావు ఆరోపించారు. సభకు ప్రజలను వెళ్లకుండా చేయడానికి స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు ఆంక్షలు విధించి, సీజ్ చేస్తామంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు.
ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటూ హెచ్చరించారు. ప్రజలపై ఎంత ఒత్తిడి తీసుకురాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని కాంతారావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరింత ఆదరిస్తున్నారని, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజలు ప్రణాళికాబద్ధంగా సభ స్థలానికి తరలివస్తున్నారని వివరించారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు, అసంబద్ధమైన వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. గ్యారెంటీ కార్డులు, వాగ్దానాలతో నింపిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు త్వరలోనే బొంద పెడతారని ధీమా వ్యక్తం చేశారు.