Pat Cummins Happy on Australia First Win in World Cup 2023: ప్రపంచకప్ 2023లో రెండు పరాజయాల నేపథ్యంలో ఈ విజయం పట్ల తాను పెద్దగా మాట్లాడలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈరోజు తమకు కలిసొచ్చిందని, ఇదే జోరును తదుపరి మ్యాచ్‌లలో కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిన్స్ తెలిపాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘వరుసగా రెండు పరాజయాల నేపథ్యంలో పెద్దగా ఏమీ మాట్లాడలేకపోతున్నా. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. మైదానంలో మా ఆటగాళ్ల ఎనర్జీ చాలా బాగుంది. శ్రీలంక మంచి ఆరంభాన్ని అందుకుంది. మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో వికెట్లు పడగొట్టారు. బంతితో గొప్ప పోరాటం చేశారు. ఈ పిచ్‌పై 300 పరుగుల లక్ష్యం కష్టం. బయట వ్యక్తులు చాలా మాట్లాడుతారు. వారి మాటలు, విమర్శలను మేం పట్టించుకోం. ఆటలో ఈరోజు మాకు అన్ని కలిసొచ్చాయి. ఇదే జోరును తదుపరి మ్యాచ్‌ల్లోనూ కంటిన్యూ చేస్తాం’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (78; 82 బంతుల్లో 12×4), పాతున్ నిశాంక (61; 103 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీలు చేశారు. భారీ స్కోరు దిశగా సాగుతున్న లంకను ఆడమ్ జంపా (4/47), ప్యాట్ కమిన్స్ (2/32), మిచెల్ స్టార్క్ (2/43) దెబ్బతీశారు. స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోష్ ఇంగ్లిస్ (58; 59 బంతుల్లో 5×4, 1×6), మిచెల్ మార్ష్ (52; 51 బంతుల్లో 9×4) హాఫ్ సెంచరీలు చేశారు.