WTC FINAL 2023: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు. మొదటగా ఆసీస్ బ్యాటింగ్ లో ఉస్మాన్ ఖవాజా డకౌట్ రూపంలో భారత్ కు మంచి శుభారంభం దొరకగా.. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (40) పరుగులు, లబుషేంజ్(26) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన స్టీవెన్ స్మిత్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ట్రేవిస్ హెడ్ (163) పరుగులతో ఆసీస్ స్కోరును భారీ దిశగా తీసుకెళ్లాడు.
Read Also: RBI: వడ్డీలు పెరిగేది లేదు.. రెపోరేటు యథాతథం
స్టీవెన్ స్మిత్‌కు అతని కెరీర్ లో 31వ సెంచరీ. తద్వారా అతడు ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మాథ్యూ హెడెన్ (31)ను దాటేశాడు. స్మిత్ కంటే ముందు స్టీవ్ వా (32), రికీ పాంటింగ్ (41) లు టాప్-2లో ఉన్నారు. స్మిత్ కు ఇది ఇంగ్లాండ్ లో ఏడో సెంచరీ కావడం విశేషం. భారత్ పై 9వ టెస్టు సెంచరీ చేశాడు. దీంతో అతడు వివిన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ (భారత్ పై 8 సెంచరీలు) ల రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ కూడా భారత్ పై 9 సెంచరీలు చేశాడు.
Read Also: Alluarjun :ఆ కారణం వల్ల భారీ హిట్ ను వదులుకున్న అల్లు అర్జున్..?
అయితే భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడానికి చెమటోడుస్తున్నారు. ఇక నిన్ననే(బుధవారం) సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్.. నేడు (గురువారం) షమీ వేసిన 88వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి150 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అయితే నిన్నటి మాదిరిగానే దూకుడుగా ఆడిన హెడ్ ను సిరాజ్ బోల్తా కట్టించాడు. సిరాజ్ వేసిన 92వ ఓవర్లో హెడ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్మిత్ తో కలిసి హెడ్ నెలకొల్పిన 285 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం అలెక్స్ క్యారీ.. స్మిత్ తో కలిసి ఆడుతున్నారు. ఆ తర్వాత స్టార్క్, కమిన్స్ రూపంలో ఆసీస్ కు లోయరార్డర్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఇప్పటికే ఆసీస్ స్కోరు భారీ దిశగా పరుగులు తీస్తుంది. దీనికి భారత బౌలర్లు అడ్డుకట్ట వేయాలంటే గట్టిగా శ్రమించాల్సిందే.. లేదంటే రోహిత్ సేనకు తిప్పలు తప్పవు.