నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధికి రూ.500కోట్లు కేంద్రం ఇచ్చింది. కనీసం రోడ్లు కూడా వేయలేదు. దీనిపై మంత్రులు సమాధానం చెప్పాలన్నారు సోము వీర్రాజు. 23వ తేదీన వారందరికీ బుద్ధి చెప్పాలి. బ్యాలెట్ లో రెండవ నెంబర్ గుర్తుపై ఓటు వేయండి. ఛాలెంజ్ చేస్తున్న వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళు అయితే మా ముందుకు రండి అన్నారు. ఎవరి కోసం. ఇక్కడ తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
రాజ్యసభ సభ్యులు జీ వీ ఎల్. నరసింహారావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని బీజేపీ నిలిపిన మా చిత్తశుద్ధి అర్థం అవుతుంది. ఒకే కుటుంబం ఇక్కడ రాజ్యమేలుతున్నారు. మూడేళ్ళ పరిపాలనలో రైతులకు అన్యాయం చేసింది. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించలేదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వైసీపీకి చరమగీతం పాడాలి. ఇక్కడ జరిగే ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. అందరూ బీజేపీని గెలిపించండి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తాం అన్నారు జీవీఎల్ నరసింహారావు.