ఆసియా కప్ 2025ఓ భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అభిమానులు పెద్దగా స్టేడియంకు రాకపోయినా.. ఒకరు మాత్రం మైదానంలో సందడి చేశారు. భారత జెండా పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. దాంతో క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అఫ్గానిస్థాన్‌కు చెందిన వజ్మా ఆయుబి. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.
2022 ఆసియా కప్ సందర్భంగా స్టేడియంలో వజ్మా ఆయుబి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే ఆమె క్రికెట్ అభిమానులకు పరిచయం అయ్యారు. క్రికెట్ పట్ల ఆమెకున్న మక్కువ, కెమెరా ముందు ఆమెకున్న ఆత్మవిశ్వాసం అభిమానులను కట్టిపెడేసింది. అప్పటి నుంచి ఆమె అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యంత ముఖ్యమైన అభిమానిగా మారారు. వజ్మా అఫ్గానిస్థాన్ జట్టుకు అభిమాని అయినప్పటికీ.. భారత క్రికెట్ జట్టు అంటే కూడా బాగా ఇష్టం. టీమిండియా పట్ల తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఆసియా కప్ 2023లో భారత్, బంగ్లాదేశ్ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ జెర్సీని వజ్మా ధరించారు. ఈ జెర్సీపై విరాట్ ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది. కోహ్లీకి తాను పెద్ద అభిమాని అని, కింగ్ మ్యాచ్ చూడటానికి ఎక్కడికైనా వెళ్తానని తెలిపారు.
Also Read: Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!
సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాజ్మా ఆయుబి అఫ్గానిస్థాన్‌లో జన్మించారు కానీ.. బాల్యాన్ని మాత్రం అమెరికాలో గడిపారు. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో నివసిస్తున్నారు. అక్కడి రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్రిప్టోలో కూడా పెట్టుబడి పెట్టారు. వాజ్మా ఇన్ఫ్లూయెన్సర్ మాత్రమే కాదు.. సామాజిక కార్యకర్త కూడా. అఫ్గానిస్థాన్‌లోని పేద పిల్లల కోసం పనిచేస్తున్న చైల్డ్‌ఫండ్ సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమె జీవనశైలి, క్రికెట్ పట్ల మక్కువ, భారతీయ ఆటగాళ్ల పట్ల ఉన్న ఇష్టం ఆమెను నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తాయి. క్రికెట్ మైదానంలో వాజ్మా సందడి మాములుగా ఉండదు. మరోసారి ఆసియా కప్ 2025లో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వజ్మా వచ్చిన మ్యాచ్‌లను భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువ. ఆమె ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. భారత్, పాక్ మ్యాచ్‌కు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై భారత్ విజయం పక్కా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.