Virender Sehwag Game Changers List for 2025Asia Cup: ఆసియా కప్ 2025కి సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి టోర్నీ మొదలు కానుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్ కోసం వచ్చే వారంలో యూఏఈకి టీమిండియా పయనం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 మందిలో ముగ్గురే గేమ్ ఛేంజర్లు అని అవుతారని పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి టోర్నీలో కీలక పాత్ర పోషిస్తారని వీరూ అభిప్రాయపడ్డాడు.
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఆటను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇటీవలి కాలంలో అతడు బాగా ఆడుతున్నాడు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ ఎలా ఉంటుందో మరోసారి నాకు చూడాలని ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రభావం చూపిన వరుణ్.. ఈసారి కూడా ఎఫెక్ట్ చూపిస్తాడనని నమ్మకంగా ఉన్నా. వరుణ్‌కు టీ20 ఫార్మాట్ బాగా కలిసొస్తోంది. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి నేను చెప్పేదేముంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అతడు మ్యాచ్ విన్నరే. ఆసియా కప్ 2025లో ఈ ముగ్గురే గేమ్ ఛేంజర్లు అవుతారు’ అని చెప్పాడు. సెహ్వాగ్ లిస్టులో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్ లాంటి స్టార్స్ లేకపోవడం గమనార్హం.
అభిషేక్ శర్మ జూలై 2024లో అరంగేట్రం చేశాడు. ఆనతి కాలంలోనే టీ20ల్లో ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడడం అతడికి కలిసొచ్చింది. వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కేవలం మూడు టెస్టులే ఆడాడు. బుమ్రా ఫిట్‌నెస్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అయితే అతడు మ్యాచులో ఉంటే ప్రత్యర్థులకు వణుకే. ఇక వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి 18 టీ20లలో ఏడు కంటే ఎక్కువ ఎకానమీతో రన్స్ ఇచ్చి.. 33 వికెట్లు పడగొట్టాడు.
Also Read: CM Chandrababu: ఉల్లి రైతును ఆదుకునేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జితేశ్ శర్మ (కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా.