ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ నుంచి సూపర్-4 చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-4కు చేరుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన యూఏఈ పరాజయం పాలైంది. లేదంటే ఆతిథ్య యూఏఈ సంచలనం సృష్టించేదే.
గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్థాన్, యూఏఈల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సూపర్-4లో చోటు దక్కుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 146 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్ (0), సాహిబ్‌జాదా ఫర్హాన్ (5)లు వరుస ఓవర్లలో ఔట్ అయ్యారు. ఈ దశలో ఫకార్ జమాన్ (50; 36 బంతుల్లో 2×4, 3×6), సల్మాన్ అఘా (20) క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి పాక్ (3/26) ధాటికి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ చివరలో షహీన్ అఫ్రిది (29 నాటౌట్; 14 బంతుల్లో 3×4, 2×6) చెలరేగి జట్టుకు మరోసారి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. జునైద్ సిద్ధిఖ్ (4/18) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం.. వరద నీటిలో మునిగి యువకుడి మృతి!
మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ సమయంలో 85/3తో ఉన్న యూఏఈ.. విజయం సాధించి సంచలనం సృష్టిస్తుందేమో అనుకున్నారు. అయితే కీలక సమయంలో వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. 85 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన యూఏఈ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 20 పరుగుల తేడాతో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హారిస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ 2 వికెట్స్ పడగొట్టారు.