ఆదివారం ముంబై వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత అమ్మ సోనియాను కలిసి కన్నీటిపర్యంతం అయ్యారని.. బీజేపీ నేతల వేధింపులు తాళలేకే పార్టీని వీడుతున్నట్లు ఆ నేత చెప్పుకొచ్చారంటూ బహిరంగ సభలో రాహుల్ గుర్తుచేశారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కాంగ్రెస్ నేత అశోక్‌చవాన్ స్పందించారు. రాహుల్ గాంధీ ప్రస్తావించిన సీనియర్ లీడర్‌ను తాను కాదని అశోక్ చవాన్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌కు రాజీనామా తర్వాత తాను సోనియాగాంధీనే కలవలేదని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్ స్టంట్‌లో భాగంగానే రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారని కొట్టిపారేశారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం ముంబైలో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమిలో ఉన్న పార్టీల ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తాను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు గానీ.. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారని.. అమ్మ సోనియాతో ఆయన మాట్లాడుతూ.. వారితో పోరాడే శక్తి తనకు లేదని.. జైలుకు వెళ్లాలనుకోవడం లేదని చెప్పారన్నారు. ఇలా చెబుతున్నందుకు సిగ్గుగా ఉందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారని రాహుల్ తెలిపారు.
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు తన గురించి కాదని తెలిపారు. తాను రాజీనామా చేసే వరకు ఎవరికీ తెలియదని.. రిజైన్ చేసేంత వరకూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనే పని చేసినట్లు వెల్లడించారు. ఇక సోనియానైతే అసలు కలవలేదని.. కన్నీరు పెట్టుకున్న వ్యాఖ్య నిరాధారమని కొట్టిపారేశారు. ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే మాజీ సీఎం అశోక్ చవాన్‌పై పలు కేసులున్నాయి. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో 2010లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో భాగంగానే ఆయన పార్టీ వీడారని అప్పుట్లో వార్తలు వినిపించాయి.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో అశోక్‌చవాన్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కమలం పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే ఆయన రాజ్యసభ సీటు దక్కింది. మహారాష్ట్ర నుంచి ఆయన పెద్దల సభకు ఎంపికయ్యారు.