టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్ధమవుతోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లోని తొలి టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించిన విషయం తెలిసిందే. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టును అద్భుతంగా నడిపించి విజయాన్ని అందించాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్ లేకున్నా.. తన బౌలింగ్‌తో ఆతిథ్య ఆస్ట్రేలియాను వణికించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టును బుమ్రా అద్భుతంగా ముందుకు నడిపించాడు. అద్భుత బౌలింగ్ విన్యాసాలతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్‌కు కోచ్ ఆశిశ్ నెహ్రా స్పందించాడు.
Also Read: Donald Trump: బాధ్యతలు స్వీకరించముందే విడిచిపెట్టండి.. లేదంటే నరకం చూపిస్తా: ట్రంప్
‘బౌలర్‌గా బుమ్రా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో పెర్త్ టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. లీడ్ పేసర్, కెప్టెన్ కాబట్టి బుమ్రాపై ఒత్తిడి బాగా ఉండాలి. కానీ అతడు ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం చాలా ప్రశంసనీయం. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ తర్వాత భారత జట్టును బుమ్రా నడిపించిన తీరు అద్భుతం. అతడిని ఓడించలేరు. ఒకవేళ బుమ్రా వేలంలో ఉంటే.. ఏదైనా అద్భుతమే జరిగేది. వేలంలోకి వస్తే జట్లకు రూ.520 కోట్ల పర్స్ కూడా సరిపోదు’ అని ఆశిశ్ నెహ్రా చెప్పాడు. 2025 మెగా వేలానికి ముందు తొలి ప్రాధాన్య ఆటగాడిగా బుమ్రాను ముంబై రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది.