Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు గౌరవం పెంచారని, మూడు సార్లు వారి పారితోషికాలను పెంచారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు వేతనం రూ.1500 మాత్రమే ఉండగా, కేసీఆర్ పాలనలో అది రూ.9750కు పెరిగిందని గుర్తుచేశారు. వారి పనితీరును మెరుగుపరిచేందుకు ఉచిత మొబైల్ ఫోన్లు అందించారని, ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశా వర్కర్లపై అణచివేత పాలన కొనసాగిస్తున్నదని, వారి హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపినందుకు అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. “ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా?” అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.
15 నెలల పాలన పూర్తయిందని, రెండు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారని, అయినా హామీలు అమలు చేయకపోవడంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. హామీల అమలుకు ఇంకా ఎంతకాలం పట్టనుందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. “ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా ఆశా వర్కర్ల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుంది” అని హరీష్ రావు స్పష్టం చేశారు.
Face Mask : మీ చర్మాన్ని బిగుతుగా చేసే మూడు అద్భుతమైన ఫేస్ మాస్క్‌లు