ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తనపై నమోదైన కేసు ఏమిటో తెలపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎఫ్ఐఆర్ ను చూడటం ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి నేను భయపడనని అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాన్ని విమర్శించడాన్ని, విద్వేషపూరిత వ్యాఖ్యలుగా చూడలేమని ఆయన అన్నారు.
ఢిల్లీ పోలీసులకు యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వంటి వారిపై కేసులు కొనసాగించే ధైర్యం లేనట్లు కనిపిస్తోందని.. ఇందుకు పోలీసుల ఆలస్యంగా స్పందించమే కారణం ట్వీట్ చేశారు. ముస్లింలపై మారణహోమాన్ని ప్రోత్సహించడం, ఇస్లాంను కించపరచడం ద్వారా యతి నరసింహానంద బెయిల్ రూల్స్ ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలకు అలవాటు పడ్డారని.. అంతర్జాతీయ సమాజం ఖండించినప్పుడు మాత్రమే కోర్టులు, పోలీసులు నామమాత్రమైన చర్యలు తీసుకుంటున్నారని అసదుద్దీన్ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు ‘ బ్యాలెన్సుడ్ వాద్’ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని.. హిందూ మతోన్మాదులను నొప్పించకుండా ఈ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే మార్గాల గురించి ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు. ఒక పక్క మహ్మద్ ప్రవక్తను అవమానిస్తూనే.. మరోవైపు బీజేపీ మద్దతుదారులను ఒప్పించేందుకు నాపై కేసు పెట్టారని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. దీనికి విరుద్ధంగా, ముస్లిం విద్యార్థులు, జర్నలిస్టులు, కార్యకర్తలు కేవలం ముస్లిం అనే నేరానికి జైలులో పెట్టారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.