ప్రాంక్ చేయబోయి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ మెడకు ఉచ్చుబిగుసుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఓరై ప్రాంతంలోని కాన్షీరాం కాలనీలో ఓ బాలుడు తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాన్షీరాం కాలనీ పోలీసు ఔట్‌పోస్టు ఇన్‌చార్జి మహ్మద్ ఆరీఫ్ దీని గురించి వివరిస్తూ 13 ఏళ్ల బాలుడు ప్రాంక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు.
Also Read: Success Story: అప్పుడు దేశానికి సేవ చేశాడు.. ఇప్పుడు వ్యవసాయం చేసి పదిమంది కడుపు నింపుతున్నాడు
తన చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో తన కళ్లకు గుడ్డ కట్టుకొని, ఆపై మెడకు తాడుతో ఉచ్చు బిగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తరువాత ఆ తాడును ఓ కిటికీకి కట్టి ఓ టేబుల్ పై కూర్చున్నట్లు పోలీసులు వివరించారు. అయితే ఆడుకునే సమయంలో ఆ టేబుల్ ఎవరో నెట్టారని దాంతో బాలుడి మెడకు ఉచ్చు బిగుసుకొని అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న బాలుడు చనిపోవడంతో చుట్టుపక్కల విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఘటనలో చనిపోయిన బాలుడి తల్లి అంధురాలు. అందుకే బాలుడు ప్రమాదంలో ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేకపోయింది. ఇదే విషయాన్ని స్థానికుల వద్ద చెబుతూ ఆమె కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తోంది. తనకే కనుక కళ్లు ఉండి ఉంటే తన బిడ్డను కాపాడుకోగలిగేదానినని తాను అంధురాలిని అవడం వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తోంది. అందుకే పిల్లలకు అన్ని విషయాలు తెలిసే దాకా, ప్రపంచం గురించి అవగాహన వచ్చే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఎంతో అవసరం.