Indian Embassy Issues Advisory: పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది. ముందుజాగ్రత్తగా అక్కడ నివసిస్తున్న భారతీయులను సురక్షిత ప్రదేశాలలో ఉండాలని భారతదేశం కోరింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్‌లో ఉందని, యుద్ధ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారత్ తెలిపింది. భారత్ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో 32 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ముందు పౌరులందరూ బాంబు షెల్టర్లకు వెళ్లినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా
ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను రక్షించడంలో, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయడంలో సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ మిలిటరీని ఆదేశించారు. ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు గతంలో పేర్కొన్నారు. ఎలాంటి ప్రతీకార చర్యకైనా టెహ్రాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
అమెరికా అప్రమత్తం
లెబనాన్‌లో టెహ్రాన్ మద్దతుగల హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ నిరంతరం వైమానిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న భయాలు, ఖమేనీ పాలన ఇజ్రాయెల్‌పై దాడి చేయగలదని అమెరికా హెచ్చరించింది.
నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రపంచంలో ఉగ్రవాదం, యుద్ధానికి చోటు లేదని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. అదే సమయంలో, సోమవారం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ పాలకుడిపై విమర్శలు చేస్తూ.. ఇరాన్ పాలన మిమ్మల్ని అణిచివేస్తోందన్నారు. ఇలా చేయడం ద్వారా ఈ ప్రాంతమంతా యుద్ధం వైపు నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇరాన్ పాలకుడి ప్రాథమిక లక్ష్యం ప్రజల సంక్షేమం కాదు, లెబనాన్, గాజాలో యుద్ధంలో డబ్బును వృథా చేయడమని వ్యాఖ్యానించారు.