Aroori Ramesh: వరంగల్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుజ్జగించినట్లు సమాచారం. అనంతరం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆరూరి రమేష్ చెప్పారు. “నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఈరోజు నన్ను ఎవరూ అడ్డుకోలేదు. నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి రమేష్ తెలిపారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ లోకల్.. వినోద్ వలస పక్షి..
హనుమకొండ పట్టణంలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తల నేపథ్యంలో ఆరూరి బుధవారం ప్రెస్ మీట్పెడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లారని తెలిసింది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన మెత్తబడలేదు. ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునే ముందు ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ నేతలు ఇంట్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే తాము వచ్చామని నేతలు చెప్పారు. సాయంత్రం హరీష్ రావు వస్తారని, పార్టీ మారొద్దని బీఆర్ఎస్ నేతలు ఆరూరికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో ‘జై ఆరూరి’ అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు.