సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు లోపలకు దూసుకొచ్చారు. ఆ తర్వాత రైల్వేస్టేషన్‌లోని రైళ్లకు, ప్లాట్‌ఫారంపై పలు స్టాళ్లకు నిప్పంటించారు.
అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులపై పోలీసులు కాల్పులు జరపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు కాకుండా.. కాల్పులు జరిపే హక్కు ఎవరిచ్చారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ ఉన్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమాయకంగా ఓ యువకుడి ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లు వేయడంతోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు చెబుతున్నారు. కానీ గాల్లోకి కాల్పులు జరిపితే దాదాపు 10 మందికి తీవ్ర గాయాలు ఎలా అయ్యాయని నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడంతోనే తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరిస్తున్నారు.