ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయను ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఎంతో మంది అరకు వస్తుంటారు. అరకు లోయతో పాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాల కొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాది మంది పర్యటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
ముఖ్యంగా బొర్రా గుహలకు పర్యాటకులు పోటెత్తారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా.. ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. దీంతో ప్రముఖ పర్యాటక కేంద్రాలు అన్నీ కోలాహలంగా మారాయి. మంగళ, బుధ వారాలు బొర్రా గుహలను సుమారు 11 వేల మంది సందర్శించారని అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో రూ.10.50 లక్షల మేర ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు అరకు లోయలో వర్షాలు కురవనున్నాయి.