ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలం పెందుర్తి మండలం కరకవానీ పాలెంలో బంధు మిత్రులు, ప్రజాసంఘాలు అంతిమ వీడ్కోలు పలికాయి. అంతిమ యాత్రలో ‘కామ్రేడ్ అరుణ అమర్ ర హే’ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ మరణించిన విషయం తెలిసిందే.
ఏవోబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేస్తున్న అరుణ 20 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో గడిపారు. హరివెంకట చైతన్య అలియాస్ అరుణ కోసం ఏడేళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సివేరి సోమ, సర్వేశ్వరరావు హత్య కేసులు సహా పలు నేరాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వామక్ష భావజాలం కలిగిన అరుణ కుటుంబం మొదటి నుంచి మావోయిస్టు పార్టీకి దగ్గరైంది. అరుణ, ఆమె తమ్ముడు అజాద్ ఇద్దరు ఉద్యమ బాట పట్టారు. పార్టీ కీలక నేత చలపతి భార్య అరుణ. 2016లో పాల సముద్రం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో అరుణ తమ్ముడు అజాద్ మరణించాడు.
Also Read: Diamond Hundi: ఆంజనేయస్వామి ఆలయ హుండీలో ఖరీదైన వజ్రం.. అజ్ఞాత భక్తుడి లేఖ!
అజాద్ ల్యాప్ టాప్‌లో దొరికిన ఫోటోల ఆధారంగా చాలా కాలం తర్వాత అరుణ, చలపతి బాహ్య ప్రపంచానికి తెలిశారు. కొద్ది రోజుల క్రితం దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో చలపతి మరణించారు. ఇటీవలి ఎన్‌కౌంటర్‌లో అరుణ మరణించారు. ఆమెతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా మరణించారు. మరో నక్సల్ అంజూ కూడా చనిపోయారు. 2026 మార్చి 31లోగా మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది.